
- బంగాళాఖాతం, నికోబార్ దీవులను తాకిన రుతుపవనాలు
- రానున్న మూడు నాలుగు రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరణ
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం, ఉత్తర అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకాయని వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ప్రకటించింది. రుతుపవనాల రాకతో నికోబార్ దీవుల్లో గత రెండ్రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లో బలమైన గాలులు వీస్తున్నాయని తెలిపింది. రానున్న మూడు నాలుగు రోజుల్లో రుతుపవనాలు మరింత ముందుకు కదులుతాయని చెప్పింది.
దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మరిన్ని ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు అండమాన్ అండ్ నికోబార్ దీవులన్నింటికీ విస్తరిస్తాయని వెల్లడించింది. ఇందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. కాగా, ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తాయని, ఈ నెల 27 నాటికి కేరళను తాకుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది.
సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రతిఏటా జూన్ 1న కేరళను తాకుతాయి. ఒకవేళ రుతుపవనాలు ఈ నెల 27 నాటికి కేరళను తాకితే, 2009 తర్వాత ఇదే ముందస్తు నైరుతి అవుతుంది. ఆ ఏడాది మే 23నే రుతుపవనాలు కేరళను తాకాయి. మరోవైపు ఈసారి వానాకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.